Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిసోడియాకు బెయిల్ రావడంపై ఆప్ నేతల భావోద్వేగం!

AAP Leaders Reaction On Manish Sisodia Bail
Advertisement
  • పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే ఆయన చేసిన నేరమన్న రాఘవ్ చద్ధా
  • చివరకు నిజం గెలిచిందంటూ సంజయ్ సింగ్ వ్యాఖ్య
  • కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ కూ న్యాయం జరుగుతుందని ఆశాభావం
Advertisement
మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు విని ఢిల్లీ మంత్రి అతిశీ కన్నీటిపర్యంతమయ్యారు. ఎట్టకేలకు సిసోడియా బయటకు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఢిల్లీలోని చిన్నారుల విజయమని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా, ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లినా చిన్నారుల భవిష్యత్తు గురించి ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. ఎవరికీ రాని ఆలోచన మనీశ్ సిసోడియాకు వచ్చిందని, దానిని చేతల్లో పెట్టి ఢిల్లీలోని నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం తపనపడ్డారని గుర్తుచేసుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని అన్యాయంగా జైలుకు పంపారంటూ విమర్శలు గుప్పించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్ధా స్పందిస్తూ.. సిసోడియా 530 రోజుల పాటు జైలులోనే గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు బెయిల్ వచ్చిందన్న వార్త విని యావత్ దేశం సంతోషం వ్యక్తం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే సిసోడియా చేసిన నేరమని అన్నారు. విద్యాశాఖలో ఆయన గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారని, ప్రతీ విద్యార్థికి మెరుగైన విద్య అందించాలని తాపత్రయపడ్డారని చెప్పారు.

సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నియంతృత్వానికి చెంపదెబ్బలాంటిదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి గత 17 నెలలుగా ఊచల వెనకే ఉండిపోయారని చెప్పారు. చివరికి ఈ రోజు నిజం గెలిచిందని, సిసోడియాకు న్యాయం జరిగిందని అన్నారు. ఇదేవిధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ లకు కూడా త్వరలో బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
Manish Sisodia
Bail
AAP
Raghav Chadda
Atishi
Sanjay Singh

More Telugu News